భాగవత పద్యరత్నాలు
Please ref to : http://telugubhagavatam.org/?Details&Branch=amrutagulikalu&Fruit=ratnalu
అమృతగుళికలు : రత్నాలు
అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ,సురారులమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ,కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.
భావము:- దుర్గాదేవి తల్లు లందరికి తల్లి; సప్తమాతృకలను కన్నతల్లి; ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి; అందరు అమ్మల కన్నా అధికురాలైన గొప్పతల్లి; రక్కసి మూకలను అణచిన యమ్మ; నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి; అయిన మా అమ్మ దయాసముద్రి అయి ఈ మహాభాగవత తెలుగు ప్రణీత మందు కవిత్వంలో గొప్పదనము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక.
"అమ్మా! మన్నుదినంగ నే శిశువునో? యాఁకొంటినో? వెఱ్ఱినో?
నమ్మంజూడకు వీరి మాటలు మదిన్; న న్నీవు గొట్టంగ వీ
రి మ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీయాస్య గం
ధ మ్మాఘ్రాణము జేసి నా వచనముల్ దప్పైన దండింపవే."
భావము:- " అమ్మా! మట్టి తినడానికి నేనేమైనా చంటిపిల్లాడినా చెప్పు. ఇప్పుడే కదా పాలు తాగాను ఇంకా ఆకలి ఎందుకు వేస్తుంది. లేకపోతే నేనేమైనా అంత వెఱ్ఱివాడినా ఏమిటి మట్టి తినడానికి. నువ్వు నన్ను కొట్టాలని వీళ్ళు కల్పించి చెప్తున్నారు అంతే. కావాలంటే నా నోరు వాసన చూడు. నే చెప్పింది అబద్ధమైతే కొట్టుదుగానిలే. వీళ్ళు చెప్పేమాటలు నమ్మవద్దు" అని చిన్నికృష్ణుడు.
మట్టి ఎందుకు తింటున్నావని దెబ్బలాడుతున్న తల్లి యశోదమ్మకి సర్ది చెప్పి, నోరు తెరిచి చూపించబోతున్నాడు.
అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబు దా
పలమందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పలపర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వలనాగేంద్రము పాహిపాహి యనఁ గుయ్యాలించి సంరంభియై.
భావము:- ఆపదలలో చిక్కుకున్న వారిని కాపాడే ఆ భగవంతుడు ఆ సమయంలో వైకుంఠంలో ఉన్నాడు. అక్కడ అంతఃపురంలో ఒక పక్కన ఉండే మేడకు సమీపంలో ఒక అమృత సరస్సుంది. దానికి దగ్గరలో చంద్రకాంతశిలల అరుగుమీద కలువపూల పాన్పుపై లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు. అప్పుడు భయంతో స్వాధీనం తప్పిన గజేంద్రుడు కాపాడమని పెట్టే మొర విన్నాడు. గజరాజుని కాపాడడానికి వేగిరపడ్డాడు.
ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై
నంతైతోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతైచంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతైసత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.
భావము:- బలిచక్రవర్తి మూడడుగుల మేర భూమి ధారపోయగానే గ్రహించిన వామనుడు చూస్తుండగానే ఇంత పొట్టి బ్రహ్మచారీ, ఇంత ఇంత చొప్పున ఎదగటం మొదలెట్టాడు; అంతట్లోనే అంత పొడుగు ఎదిగాడు; అలా ఆకాశం అంత ఎత్తు పెరిగాడు; అదిగో మేఘాలకన్నా పైకి పెరిగిపోసాగాడు; పాలపుంత, చంద్రమండలం అన్నీ దాటేసాడు; అదిగదిగో ధ్రువ నక్షత్రం కూడ దాటేసాడు; మహర్లోకం మించిపోయాడు. సత్యలోకం కన్నా ఎత్తుకి ఇంకా ఎత్తుకి పెరిగిపోతూనే ఉన్నాడు. మొత్తం బ్రహ్మాండభాడం అంతా నిండిపోయి వెలిగిపోతున్నాడు; ఆహా ఎంతలో ఎంత త్రివిక్రమరూపం దాల్చేసాడో శ్రీమన్నారాయణ మహా ప్రభువు.
ఇందుగలఁ డందు లేఁ డని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెం దెందు వెదకి చూచిన
నందందే కలఁడు దానవాగ్రణి! వింటే."
భావము:- ఓ హిరణ్యకశిప మహారాజా! శ్రీమహావిష్ణువు ఇక్కడ ఉంటాడు; ఇక్కడ ఉండడు; అని చెప్పడానికి లేదు. అయన సర్వోపగతుడు అంటే సర్వకాల సర్వావస్థల అన్నటి యందు ఉండే వాడు. ఈవిషయంలో ఏమాత్రం సందేహం అన్నది లేదు; అందుచేత ఎక్కడైనా సరే వెతికి చూడాలే కాని అక్కడే ఉంటాడయ్యా. రాక్షసరాజా!
ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ;డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.
భావము:- ఈ లోకమంతా ఎవరి వల్లనైతే పుడుతుందో; ఎవరిలో కలిసి ఉంటుందో; ఎవరి లోపల లయం అయిపోతుందో; ఎవరు పరమాత్ముడో; ఎవరు సృష్టికి ప్రధానకారణమై ఉన్నాడో; ఎవరైతే పుట్టడం, గిట్టడం, వాటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో; తుది, మొదలు మధ్య లేని అనంతుడో; ఎవరైతే సమస్తమైన సృష్టి తానే అయ్యి ఉంటాడో; అటువంటి స్వయంభువు, ప్రభువు ఐన భగవంతుణ్ణి నే శరణు కోరుతున్నాను.
పలికెడిది భాగవత మఁట,
పలికించెడివాడు రామభద్రుం డఁట, నేఁ
బలికిన భవహర మగునఁట,
పలికెద, వేఱొండు గాథ బలుకఁగ నేలా?
భావము:- వ్రాయబడేదేమో పరమ పవిత్రమైన శ్రీమద్భాగవతం. కరుణా సముద్రుడైన శ్రీరామచంద్రప్రభువేమో వ్రాయించేవాడుట. వ్రాసి నందువల్ల భవభందాలు పరిహారము అవుతాయిట. అంచేత భాగవతాన్ని వ్రాస్తాను. మిగతా వేవి వ్రాయను.
మందార మకరంద మాధుర్యమునఁ దేలు;
మధుపంబు వోవునే మదనములకు?
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు;
రాయంచ సనునె తరంగిణులకు?
లలిత రసాలపల్లవ ఖాదియై చొక్కు;
కోయిల చేరునే కుటజములకుఁ?
బూర్ణేందు చంద్రికా స్ఫురితచకోరక;
మరుగునే సాంద్ర నీహారములకు?
తే.
నంబుజోదర దివ్యపాదారవింద
చింతనామృతపానవిశేషమత్త
చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు?
వినుతగుణశీల! మాటలు వేయు నేల?"
భావము:- సుగుణాలతో సంచరించే ఓ గురూత్తమా! మందార పూలలోని మకరందం త్రాగి మాధుర్యం అనుభవించే తుమ్మెద, ఉమ్మెత్త పూల కేసి పోతుందా? రాజహంస స్వచ్ఛమైన ఆకాశగంగా నదీ తరంగాలపై విహరిస్తుంది కాని వాగులు వంకలు దగ్గరకు వెళ్ళదు కదా? తీపి మామిడి చెట్ల లేత చిగుళ్ళు తిని పులకించిన కోయిల పాటలు పాడుతుంది తప్ప కొండ మల్లెల వైపు పోతుందా? చకోర పక్షి నిండు పున్నమి పండువెన్నెలలో విహరిస్తుంది కాని దట్టమైన మంచు తెరల వైపునకు వెళ్తుందా? చెప్పండి. అలాగే పద్మనాభస్వామి విష్ణుమూర్తి దివ్యమైన పాదపద్మాలను ధ్యానించటం అనే అమృతం గ్రోలటంలో మాత్రమే నా మనసు పరవశించి ఆనందం పొందుతుంది. వెయ్యి మాటలు ఎందుకు లెండి, హరిపాదాయత్త మైన నా చిత్తం ఇతర విషయాల పైకి ఏమాత్రం పోవటం లేదు."
మ్రింగెడి వాఁడు విభుం డని
మ్రింగెడిదియు గరళ మనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!
భావము:- ఆమె సర్వమంగళ కదా మరి; అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది. కనుకనే మింగేవాడు తన భర్త అని, మింగేది విషం అని తెలిసి కూడ లోకులు అందరికి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతోనే పార్వతీదేవి హాలాహలాన్ని మింగు మని పరమశివునికి చెప్పింది.
లావొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;
నీవేతప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;
రావే!యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!
భావము:- దేవా! నాలో శక్తి కొంచం కూడ లేదు. ధైర్యం సడలి పోయింది. ప్రాణాలు కూడ కదలిపోతున్నాయి. మూర్చ వచ్చేస్తూ ఉంది. శరీరం స్రుక్కిపోయింది. బాగా అలసటగా ఉంది. నాకు నీవు తప్ప వేరే ఇతరు లెవ్వరు నాకు తెలియదు. నీవే దిక్కు. ఆర్తితో ఉన్న నన్ను ఆదుకోవయ్య. ఓ స్వామీ! రావయ్యా! కరుణించు, వరాలిచ్చే ప్రభూ! కాపాడు, పుణ్యాత్ముడా!
శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా!
లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా
నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా!
నీకున్మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!
భావము:- శ్రీ కృష్ణా! యదుకులవిభూషణా! అర్జునమిత్రా! శృంగార రత్నాకరా! జగత్కంటకులైన రాజుల వంశాలను దహించే వాడా! జగదీశ్వరా! ఆపన్నులైన దేవతల, బ్రాహ్మణుల, ఆవులమందల ఆర్తులను బాపువాడా! మోక్షాన్ని ప్రసాదించే ప్రభూ! నీకు నమస్కరిస్తున్నాను; నాకీ ఈ భవబంధాలను తెంపెయ్యి.
సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబునుఁ జీరఁ" డభ్రగపతిం బన్నింపఁ" డాకర్ణికాం
తరధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై. \
భావము:- గజేంద్రుడి ప్రాణాలు కాపాడాలనే వేగిరపాటుతో విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రాలను చేతులలో ధరించలేదు. సేవకులను ఎవరిని పిలవలేదు. వాహనం ఐన గరుత్మంతుని పిలవలేదు. చెవికుండలాల వరకు జారిన జుట్టుముడి కూడ చక్కదిద్దుకోలేదు. ఆఖరికి ప్రణయ కలహంలో పట్టిన లక్ష్మీదేవి పైటకొంగు కూడ వదలి పెట్టలేదు.
కమలాక్షు నర్చించు కరములు కరములు;
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు;
శేషశాయికి మ్రొక్కు శిరము శిరము;
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు;
మధువైరిఁ దవిలిన మనము మనము;
భగవంతు వలగొను పదములు పదములు;
పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి;
తే.
దేవదేవుని చింతించు దినము దినము;
చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు;
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు;
తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి.
భావము:- నాన్న గారు! కమలా వంటి కన్నులు కల ఆ విష్ణుమూర్తిని పూజిస్తేనే అవి చేతులు; లేకపోతే చేతులు, చేతులు కావు; శ్రీపతి అయిన విష్ణుదేవుని స్త్రోత్రము చేస్తేనే నాలుక అనుటకు అర్హమైనది; కాకపోతే ఆ నాలుకకు సార్థకత లేదు; దేవతలను కాపాడే ఆ హరిని చూసేవి మాత్రమే చూపులు; ఇతరమైన చూపులకు విలువ లేదు; ఆదిశేషుని పానుపుగా కల ఆ నారాయణునకు మ్రొక్కేది మాత్రమే శిరస్సు; మిగిలిన శిరస్సులకు విలువ లేదు; విష్ణు కథలు వినే చెవులే చెవులు; మధు అనే రాక్షసుని చంపిన హరి యందు లగ్నమైతేనే చిత్త మనవలెను; పరమ భగవంతుడైన ఆయనకు ప్రదక్షిణము చేసేవి మాత్రమే పాదాలు; మిగతావి పాదాలా? కాదు. పురుషోత్తము డైన ఆయనను భావించే బుద్ధే బుద్ధి; లేకపోతే అది సద్భుద్ధి కాదు; ఆ దేవుళ్లకే దేవుడైన విష్ణుమూర్తిని తలచు దినమే సుదినము; చక్రాయుధం ధరించు ఆ నారాయణుని గాథలు విశదపరుచు చదువు మాత్రమే సరైన చదువు; భూదేవి భర్త అయిన గోవిందుని గురించి బోధించే వాడే గురువు; విష్ణుమూర్తిని సేవించమని చెప్పే తండ్రే తండ్రి కాని ఇతరులు తండ్రులా? కాదు; నాన్నగారు! దేహి శరీరంలోని చేతులు, నాలుక, కళ్ళు, శిరస్సు, చెవులు, చిత్తం, పాదాలు, బుద్ధి ఒకటేమిటి? సమస్తమైన అవయవాలు విష్ణు భక్తిలో పరవశమై పవిత్రం కావలసిందే. లేకపోతే అతడు భగవంతుని విషయంలో కృతఘ్నుడే. ప్రతి రోజూ, ప్రతి చదువూ శ్రీ హరి స్మరణలతో పునీతం కావలసిందే. ప్రతి గురువూ, ప్రతి తండ్రీ నారాయణ భక్తిని బోధించాల్సిందే. అవును లోకైకరక్షాకరు డైన విష్ణుమూర్తికి అంకితం గాని దేనికి సార్థకత లేదు.
కుప్పించి యెగసినఁ గుండలంబుల కాంతి;
గగనభాగం బెల్లఁ గప్పికొనఁగ;
నుఱికిన నోర్వక యుదరంబులో నున్న;
జగముల వ్రేఁగున జగతి గదలఁ;
జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ;
బైనున్న పచ్చనిపటము జాఱ;
నమ్మితి నాలావు నగుఁబాటు సేయక;
మన్నింపు మని క్రీడి మరలఁ దిగువఁ;
తే.
గరికి లంఘించు సింహంబుకరణి మెఱసి
నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు
విడువు మర్జున యనుచు మద్విశిఖ వృష్టిఁ
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.
భావము:- ఆ నాడు యుద్ధభూమిలో నా బాణవర్షాన్ని భరించలేక నా మీదికి దుమికే నా స్వామి వీరగంభీర స్వరూపం ఇప్పటికీ నాకు కళ్ళకు కట్టినట్లే కన్పిస్తున్నది; కుప్పించి పై కెగిరినప్పుడు కుండలాల కాంతులు గగనమండలం నిండా వ్యాపించాయి; ముందుకు దూకినప్పుడు బొజ్జలోని ముజ్జగాల బరువు భరించలేక భూమండలం కంపించిపోయింది; చేతిలో చక్రాన్ని ధరించి అరుదెంచే వేగానికి పైనున్న బంగారుచేలం జారిపోయింది; “నమ్ముకొన్న నన్ను నలుగురిలో నవ్వులపాలు చేయవ " ద్దని మాటిమాటికి కిరీటి వెనక్కు లాగుతున్నా లెక్కచేయకుండ “అర్జునా! నన్ను వదులు. ఈ నాడు భీష్ముని సంహరించి నిన్ను కాపాడుతాను" అంటూ కరిపైకి లంఘించే కంఠీరవం లాగా నా పైకి దూకే గోపాల దేవుడే నాకు రక్ష.
నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు మహాశుగంబులున్
విల్లును దాల్చువాఁడు గడు విప్పగు వక్షమువాఁడు మేలు పైఁ
జల్లెడువాఁడు నిక్కిన భుజంబులవాఁడు యశంబు దిక్కులం
జల్లెడువాఁడు నైన రఘుసత్తముఁ డిచ్చుత మా కభీష్టముల్.
భావము:- నల్లటివాడు, పద్మాలవంటి కళ్ళు గలవాడు, గొప్ప ధనుస్సు బాణాలు ధరించు వాడు, విశాలమైన వక్షస్థలం గలవాడు, మేళ్ళు అనేకం సమకూర్చువాడు, ఎగుభుజాలు గలవాడు, అన్ని దిక్కులకు తన కీర్తిని వ్యాపింపజేసిన వాడు, రఘు కులోత్తముడు అయిన శ్రీరామచంద్రుడు మా కోరికలు తీర్చుగాక.
ప్రాణేశ! నీ మంజు భాషలు వినలేని;
కర్ణరంధ్రంబుల కలిమి యేల?
పురుషరత్నమ! నీవు భోగింపఁగా లేని;
తనులతవలని సౌందర్య మేల?
భువనమోహన! నిన్నుఁ బొడగానఁగా లేని;
చక్షురింద్రియముల సత్వ మేల?
దయిత! నీ యధరామృతంబానఁగా లేని;
జిహ్వకు ఫలరససిద్ధి యేల?
ఆ.
నీరజాతనయన! నీవనమాలికా
గంధ మబ్బలేని ఘ్రాణ మేల?
ధన్యచరిత! నీకు దాస్యంబు జేయని
జన్మ మేల? యెన్ని జన్మములకు."
భావము:- శ్రీకృష్ణ! నీ మనోఙ్ఞమైన పలుకులు వినలేని చెవులు ఎందుకు దండగ; పురుషోత్తమ! నీవు భోగించని వంటికి అంద మెందుకు దండగ; ప్రాణేశా! నిన్ను చూడలేని కళ్ళకి చూపెందుకు దండగ; ప్రభూ! నీ అధరామృతం అందని నాలుకకు రుచెందుకు దండుగ; పద్మాక్షా! నీ మెడలోని పూలహారం వాసన చూడలేని ముక్కు ఎందుకు దండగ; మహాత్మా! కృష్ణభగవాన్! ఎన్నిజన్మలకైనా నీ సేవచేయలేని దండగమారి జన్మ ఎందుకు; నాకు వద్దయ్యా!"
శ్రీకైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నాకంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.
భావము:- సర్వలోకాలను సంరక్షించేవాడిని, భక్తజనులను కాపాడుటలో మహానేర్పరి తనం గలవాడిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవాడిని, విలాసంగా చూసే చూపుతోటే నానా బ్రహ్మాండాలు సృజించే వాడిని, మహాత్ము డైన నందుని అంగన యొక్క కుమారుని (మహానందం దేహంగా గల ఆత్మీయుని) మోక్ష సంపదను అపేక్షించి సదా స్మరిస్తూ ఉంటాను.
ఇది తెలుగు చేయబడిన భాగవత గ్రంథారంభ ప్రార్థనా పద్యం. ఈ తెలుగసేతను బమ్మెర పోతనామాత్యుల వారు తన మోక్షానికే కాదు మనందరి మోక్షాన్ని అపేక్షించి చేసారు. ఇది భాగవతానికే కాదు, తెలుగు సాహితీ విశ్వానికే మకుటాయమాన మైంది. ఇష్టదేవతా స్తుతీ, వస్తు నిర్దేశమూ కల ఈ మనోజ్ఞవృత్తం మహాభాగవతంలోని ఇతివృత్తాని కంతా అద్దం పడుతుంది. శార్దూలవిక్రీడిత వృత్తం ఎన్నుకోడంలో విషయ గాంభీర్యత సూచింపబడుతోంది. స్తుతి, నిర్దేశాలను పలికించే పద విన్యాసం బహుళార్థ సాధకత, దీర్ఘకాల రమ్యత సాధిస్తున్న సూచన కావచ్చు. (అ) శ్రీ కైవల్య పదఁబు జేరుటకునై చింతించెదన్ (ఆ) లోకరక్షైకారంభకున్ (ఇ) భక్తపాలన కళా సంరంభకున్ (ఈ) దానవోద్రేక స్తంభకున్ (ఉ) కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ (ఊ) మహానందాంగనా డింభకున్ అనే అద్భుత ప్రయుక్తాలు ఈ పద్యంలో ఆరు (6) ఉన్నాయి. భగవంతుని ప్రధాన గుణాలైన సర్వేశ్వరత్వ, ధర్మ సంస్థాపకత్వ, శిష్టరక్షణ పరాయణత్వ, దుష్ట శిక్షన చణత్వ, విశ్వకర్తృత్వ, ఆనందమయత్వాలు అనే ఆరింటికి ప్రతీకలు యివి. (అ) శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ అనటంలో మోక్షం కోసం ఉత్కంఠితుడైన పరీక్షిత్తు వృత్తాంతంతో పాటు మొత్తం భాగవతమే ధ్వనిస్తున్నది. అలాగే ప్రథమ స్కంధంలోని నారదుడు, భీష్ముడు, కుంతీదేవి మొదలైనవారి కథలూ, తృతీయ స్కంధంలోని దేవహూతి వృత్తాంతమూ, చతుర్థ స్కంధంలోని ధ్రువ చరిత్రా స్ఫురిస్తూ భగవంతుని సర్వేశ్వరత్వాన్ని నిరూపిస్తున్నాయి. ఎందుకంటే కైవల్యాన్ని అనుగ్రహించే అధికారం సర్వేశ్వరునికి మాత్రమే ఉంటుంది. (ఆ) లోకరక్షైకారంభకున్ అనటంలో హిరణ్యాక్ష హిరణ్యకశివు కంస కాలయవనాదులను (తృతీయ, సప్తమ, దశమ స్కంధాలు) సంహరించి వారి అత్యాచారాల వల్ల అస్తవ్యస్తమైన లోకాన్ని ఉద్ధరించిన భగవంతుని ధర్మ సంస్థాపకత్వం సంస్థాపించబడింది.(ఇ) భక్తపాలన కళా సంరభకున్ అనటంలో భక్తులను పాలించటం భగవంతుని కళ, ఎప్పుడెప్పుడు ఆర్తులను ఆదుకుందామా అని అనుక్షణం తహతహలాడుతుంటాడు స్వామి అనే సూచన. అలాగే గజేంద్రుణ్ణి కాపాడటానికి మహా విష్ణువు వైకుంఠం నుంచి పరుగెత్తుకు వచ్చిన వృత్తాంతం (అష్టమ స్కంధం) స్పురిస్తూ భగవంతుని శిష్ట రక్షణ పరాయణత్వాన్ని చాటుతున్నది. (ఈ) దానవోద్రేకస్తంభకున్ అనటంతో అష్టమ స్కంధంలోని వామనావతారం వ్యంజకమైంది. తరువాతి మన్వంతరంలో ఇంద్రుడు కావలసిన బలి, వరబలంతో ముందుగానే స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రపదం కాంక్షించాడు. దుష్టశిక్షణచణు డైన స్వామి వామనుడై, ఆ దానవేంద్రుని ఉద్రేకానికి పగ్గాలు పట్టి స్తంభింపజేయటం ధ్వనించింది. (ఉ) కేళిలోల... కుంభకున్ అనటం వల్ల భగవంతుని విశ్వకర్తృకత్వాన్ని వెల్లడించే సూర్యవంశ చంద్రవంశాల చరిత్ర (నవమస్కంధం) స్ఫురిస్తోంది. స్వామి విలాసంగా త్రిప్పే కళ్లలో నుంచే కదా బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి. సృష్టి జరుగుతుంది. నిజానికి స్వామికళ్లు సూర్యచంద్రులేగా. ఇంకా శ్రీహరే ప్రధానకర్తని ద్వితీయ స్కంధం నిరూపిస్తోంది. (ఊ) మహానందాంగనా డింభకున్ అనటం కృష్ణలీలా సర్వస్వమైన దశమ స్కంధానికి, ఆ నందాంగనకు ఆనందానికి, మహా ఆనందమే దేహంగా కల స్వరూపికి ప్రతీక.
కంజాక్షునకుఁ గాని కాయంబు కాయమే? ;
పవన గుంఫిత చర్మభస్త్రి గాక;
వైకుంఠుఁ బొగడని వక్త్రంబు వక్త్రమే? ;
ఢమఢమ ధ్వనితోడి ఢక్క గాక;
హరిపూజనము లేని హస్తంబు హస్తమే? ;
తరుశాఖ నిర్మిత దర్వి గాక?
కమలేశుఁ జూడని కన్నులు కన్నులే? ;
తనుకుడ్యజాల రంధ్రములు గాక;
ఆ.
చక్రిచింత లేని జన్మంబు జన్మమే?
తరళ సలిల బుద్బుదంబు గాక;
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుఁడే?
పాదయుగముతోడి పశువు గాక.
భావము:- పద్మాలవంటి కన్నులు కలిగిన విష్ణుమూర్తికి పనికి రాని శరీరం కూడా ఒక శరీరమేనా? కాదు. అది గాలితో నిండిన, కొలిమిలో గాలి కొట్టుటకు ఉపయోగపడు, ఒక తోలు తిత్తి మాత్రమే. వైకుంఠవాసు డైన ఆ హరి నామం కీర్తించని అది నోరా? కాదు కాదు ఢమ ఢమ అని మ్రోగు వాద్యం. హరిని పూజించని అది చేయి అవుతుందా? కాదు అది ఒక కొయ్య తెడ్డు (చెక్క గరిటె). శ్రీపతిని చూడని కన్నులు కన్నులా? అవి ఈ శరీరం అనే గోడకి ఉన్న కిటికీలు మాత్రమే. చక్రాయుధుడు విష్ణుమూర్తిని ధ్యానించని ఆ జన్మ కూడా ఒక జన్మమేనా? అది క్షణికమైన నీటి బుడగ. వైష్ణవ భక్తి లేని పండితుడు రెండు కాళ్ళ జంతువు తప్ప వాడు పండితుడు కానేకాదు. (ఈ పద్య రత్నాలు అమూలకం పోతన స్వకీయం. “మూల వ్యాస భాగవతంలో లేనివి కనుక అమూలకం; పోతన స్వంత కృతి కనుక స్వకీయం; అంతేకాదు, పరమ భాగవతులు ప్రహ్లాదుని మానసిక స్థితితో పాటు, సహజ కవి మనోభావాలను కలగలిసినవి కనుక స్వకీయం కూడా" అని నా భావన. తన మనోభావాన్ని, తను నమ్మిన భక్తి సిద్ధాంతాన్ని, ఇక్కడ“అంధేదూదయముల్", “కమలాక్షు నర్చించు", “కంజాక్షునకు గాని", “సంసార జీమూత" అనే నాలుగు పద్యాలలో వరసగా ప్రహ్లాదుని నోట పలికించా రనుకుంటాను.)
కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ
బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై
యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్? భార్గవా!
భావము:- భర్గుని కమారుడైన శుక్రాచార్యా! పూర్వం కూడ ఎందరో రాజులు ఉన్నారు కదా. వారికి రాజ్యాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎంతో అహంకారంతో ఎంతో ఔన్నత్యాన్ని సాధించునవారే కదా. కాని వా రెవరు సంపదలు మూటగట్టుకొని పోలేదు కదా. కనీసం ప్రపంచంలో వారి పేరైనా మిగిలి లేదు కదా. శిబి చక్రవర్తివంటి వారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోరికలు తీర్చారు కదా. వారిని ఈ నాటికీ లోకం మరువలేదు కదా.
"చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నేఁ
జదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మ మెల్లఁ జదివితిఁ దండ్రీ!
భావము:- “నాన్నగారు! నన్ను గురువులు చక్కగా చదివించారు. ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం మున్నగు ముఖ్య శాస్త్రములు అన్నీ చదివి, అన్ని చదువులలోని సారమూ, రహస్యమూ సంపూర్ణంగా గ్రహించాను.
"నీ పాదకమల సేవయు
నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం
తాపార భూతదయయునుఁ
దాపసమందార! నాకు దయచేయఁ గదే!"
భావము:- తాపసులకు కల్పవృక్షం వంటివాడా! శ్రీకృష్ణా! కమలముల వంటి నీ పాదాల పరిచర్యను, నీ పాదాలు పూజించే భక్తులతో చెలిమినీ, సర్వ ప్రాణులమీద అపరిమితమైన దయనూ నాకు ప్రసాదించు.
యాదవు లందుఁ బాండుసుతులందు నధీశ్వర! నాకు మోహవి
చ్ఛేదము సేయుమయ్య! ఘనసింధువుఁ జేరెడి గంగభంగి నీ
పాదసరోజచింతనముపై ననిశంబు మదీయబుద్ధి న
త్యాదరవృత్తితోఁ గదియునట్లుగఁ జేయఁ గదయ్య! యీశ్వరా!
భావము:- స్వామీ! విశ్వేశ్వరా! శ్రీకృష్ణా! ఆత్మీయులైన యాదవులమీద, పాండవులమీద నాకున్న అనురాగ బంధాన్ని తెంపెయ్యి. కడలిలో కలిసే గంగానదిలా, నా బుద్థి సర్వదా నీ చరణసరోజ సంస్మరణంలోనే లగ్న మయ్యేటట్లు చెయ్యి.
Comments
Post a Comment